Tamilnadu Students Suicide: తమిళనాడులో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 2 వారాల వ్యవధిలో నలుగురు బాలికలు తనువు చాలించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం సాయంత్రం స్కూల్ నుంచి తిరిగొచ్చిన 11వ తరగతి బాలిక.. ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. ఈ ఘటన విరుధునగర్ జిల్లా శివకాశిలో జరిగింది. బాణసంచా కర్మాగారంలో పనిచేసే మృతురాలి తల్లిదండ్రులు.. యథావిధిగా మంగళవారం కూడా పనులకు వెళ్లారు. ఇంట్లో బాలిక అమ్మమ్మ మాత్రమే ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చిన బాలిక.. తన అమ్మమ్మ బయటికి వెళ్లిన విషయం గమనించి ఉరేసుకుంది. వచ్చి చూసేసరికి ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. తన మనమరాలు మృతదేహాన్ని చూసి వృద్ధురాలు షాక్ అయింది. చుట్టుపక్కల వారు వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. బాలిక మృతదేహాన్ని కిందికి దించి.. పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో 2 వారాల వ్యవధిలో ఇది నాలుగో ఆత్మహత్య. అంతా టీనేజీలో ఉన్న యువతులే కావడం కలకలం రేపుతోంది. అంతకుముందు కడలూరు జిల్లాలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. సంఘటనా స్థలంలో 4 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సోమవారం తిరువల్లూరు జిల్లాలోని ఓ పాఠశాల వసతి గృహంలో 12వ తరగతి విద్యార్థిని శవంగా కనిపించింది. ఈనెల 13న కాళ్లకురిచి జిల్లాలో కూడా ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలలో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతర పరిణామాలు హింసకు దారితీశాయి.