తమిళనాడులో నీటి కుంటలు, చెరువులు కనుమరుగు అవడంపై ప్రజా పనులు విభాగం(పీడబ్ల్యూడీ) మాజీ అధికారుల విడుదల చేసిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూశాయి. 50ఏళ్లలో సుమారు వెయ్యికి పైగా చెరువులు కనుమరుగైనట్లు అందులో పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం,పెరుగుతోన్న భూ కబ్జాలు, నిర్వహణపై ఆసక్తి లేకపోవడం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని నివేదికలో వివరించారు.
అప్పట్లో 39 వేలకు పైగా...
50ఏళ్ల క్రితం తమిళనాట 39,202 చెరువులు ఉండేవని ప్రజా పనుల విభాగం మాజీ అధికారులు తెలిపారు. అందులో 15 వేలు పీడబ్ల్యూడీ పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే... ఇటీవల సుమారు వెయ్యికిపైగా నీటి కుంటలు ఆక్రమణలకు గురై, ఇళ్ల స్థలాలుగా మారినట్ల వెల్లడించారు.
క్షీణించిన నీటి నిల్వలు..
తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో నీటి నిల్వలు చాలా వరకు తగ్గిపోయినట్లు మాజీ అధికారుల బృందం తెలిపింది. 50 ఏళ్లకు పూర్వం నీటి నిల్వలు సుమారు 390 టీఎంసీలుగా ఉండేవని పేర్కొంది. కాలక్రమేణా అవి 250 టీఎంసీలకు చేరినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా మైనస్‌లోకి పడిపోయిందని స్పష్టం చేసింది. ఈ కారణంగా రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేసేందుకు కూడా నీరు దొరకడం లేదని... దీంతో వారి ఆదాయమార్గాలకు గండి పడుతున్నట్లు వివరించింది.
నీటి వాడకం, నిల్వ చేయడంపై ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన తీసుకురావాలి. తద్వారా చెరువులను, నీటి కుంటలను రక్షించుకోగలం. ప్రజావసరాలకు తగినట్లుగా నీటి వినియోగించుకోగలం.