కరోనా సహా అత్యవసర పరిస్ధితులు తలెత్తినప్పుడు సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ.. దేశంలోని 100మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. పీఎం-కేర్స్ లబ్దిదారులు, ఖర్చులకు సంబంధించిన ఆర్థిక వివరాలను.. ప్రజా జవాబుదారీ ప్రమాణాలను అనుసరిస్తూ బయటపెట్టాల్సిన అవసరం ఉందని వారు ఈ లేఖలో పేర్కొన్నారు.
పీఎం-కేర్స్‌పై జరుగుతున్న చర్చను నిశితంగా గమనిస్తున్నామని తెలిపిన మాజీ ఐఏఎస్ అధికారులు... దాని నిర్వహణలో జవాబు లేని అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. ప్రధానమంత్రి హోదాకు భంగం వాటిల్లరాదంటే.. ఆయనతో ముడిపడిన అన్ని అంశాల్లోనూ పూర్తి పారదర్శకత ఉండాల్సిన అవనసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ లేఖపై సంతకం చేసిన వారిలో.. మాజీ ఐఎఎస్ అధికారులు అనితా అగ్నిహోత్రి, ఎస్పీ అంబ్రోస్, శరద్ బెహర్, సజ్జాద్ హసన్, హర్ష్ మాండర్ సహా పలువురు ఐపీఎస్ మాజీ అధికారులు కూడా ఉన్నారు.
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో పీఎం-కేర్స్‌ను ఏర్పాటు చేసింది.