పోక్సో చట్టానికి పదేళ్లు.. ఒక్కో కేసుకు 17నెలల సమయం.. 77 శాతం పెండింగ్.. - పోక్సో చట్టం కేసుల లేటెస్ట్ న్యూస్
పోక్సో చట్టం కింద కేసులు నమోదవుతున్నప్పటికీ.. తక్కువ కేసుల్లోనే నేర నిర్ధారణ అవుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఏడాది లోపే కేసు పరిష్కారం కావాల్సి ఉండగా.. సరాసరి ఒక్కో కేసుకు 17 నెలల సమయం పడుతోందని తెలిపింది. చాలా రాష్ట్రాల్లో ఈ కేసులు ప్రతిఏటా పేరుకుపోతున్నాయని వెల్లడించింది.
పోక్సో (పీఓసీఎస్ఓ) చట్టం కింద నమోదయ్యే కేసుల్లో ప్రతి మూడు కేసుల్లో ఒకటికి మాత్రమే శిక్ష ఖరారవుతోందని తాజా నివేదిక వెల్లడించింది. చండీగఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే నిర్ణీత గడువు (ఏడాదిలోపు)లో ఈ కేసుల విచారణ పూర్తవుతోందని తెలిపింది. చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను కట్టడి కోసం తీసుకు వచ్చిన పోక్సో చట్టం వచ్చి పదేళ్లు గడుస్తోన్న నేపథ్యంలో.. చట్టం అమలు, విచారణల్లో జాప్యం వంటి అంశాలపై 'ఏ డికేడ్ ఆఫ్ పోక్సో' పేరుతో అధ్యయనం జరిగింది. వరల్డ్ బ్యాంక్ భాగస్వామ్యంతో విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అనే స్వతంత్ర సంస్థ చేపట్టిన ఈ అధ్యయనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది.
- అధ్యయనంలో భాగంగా సుమారు 4లక్షల పోక్సో కేసుల సమగ్ర సమాచారాన్ని సేకరించగా.. అందులో 2.31లక్షల కేసును విశ్లేషించారు. తద్వారా పెండింగ్ కేసులు, తీర్పు క్రమాన్ని అంచనా వేశారు.
- ఈ కేసులు అత్యధికంగా పెండింగులో ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ ముందుంది. నవంబర్ 2012 నుంచి ఫిబ్రవరి 2021 మధ్యకాలంలో నమోదైన పోక్సో కేసుల్లో సుమారు 77.77 శాతం కేసులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి.
- ఈ పదేళ్ల కాలంలో తమిళనాడులో మొత్తం నమోదైన కేసుల్లో 80.2శాతం పరిష్కారమయ్యాయి.
- పోక్సో కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రతి ఒక దోషికి ముగ్గురు నిర్దోషులుగా తేలుతున్నారు. అధ్యయనం చేసిన అన్ని రాష్ట్రాల్లోనూ నిర్దోషులే అధికంగా ఉన్నారు. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్‌లో శిక్ష పడేవారితో పోలిస్తే ఏడు రెట్లు నిర్దోషులే ఉన్నారు.
- కేవలం కేరళలో మాత్రమే నిర్దోషులు, శిక్షపడే వారి మధ్య తక్కువ అంతరం ఉంది. 20.5శాతం కేసుల్లో నేరం నిరూపణ కాకపోగా .. 16.49శాతం కేసుల్లో శిక్ష పడుతోంది.
- పెండింగులో ఉన్న పోక్సో కేసుల సంఖ్య ఏటా పెరుగుతున్నప్పటికీ 2019 నాటికి ఆ సంఖ్య తగ్గింది. కానీ, ఆ తర్వాత కొవిడ్ మహమ్మారి విజృంభణతో న్యాయస్థానాల కార్యకలాపాలపై ప్రభావం పడటం వల్ల మళ్లీ పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
- ఒక్కో కేసు పరిష్కారానికి సుమారు 509.78 రోజులు లేదా పదిహేడు నెలల కాలం పడుతోంది. పోక్సో చట్టం సెక్షన్ 35 ప్రకారం ఒక ఏడాదిలోపే కేసు పరిష్కారం కావాలి.
- ఈ విషయంలో చండీగఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు మాత్రమే ఏడాదిలోపు కేసు విచారణను పూర్తిచేస్తున్నాయి.
- పోక్సో కేసుల్లో 56శాతం శారీరక లైంగిక దాడికి సంబంధించినవే ఉంటున్నాయి.
- లైంగిక వేధింపుల కేసుల్లో శిక్షలు పడటం చాలా తక్కువగా ఉంటోంది. కేవలం 18శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి.
- మొత్తంగా 138 తీర్పులను విశ్లేషించగా.. 22.9శాతం నిందితులు బాధితులకు తెలిసినవారే ఉంటున్నారు. అందులో 3.7శాతం కేసుల్లో కుటుంబ సభ్యులే నిందుతులు కావడం గమనార్హం.
- 18శాతం కేసుల్లో నిందితులు, బాధితుల మధ్య అంతకుముందే సంబంధం ఉండగా.. 44శాతం కేసుల్లో వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలింది.