తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పొరపాటుగా అకౌంట్లోకి రూ.1.28కోట్లు.. తిరిగివ్వని భారతీయుడికి జైలు శిక్ష - crores By mistakenly Deposited in Indian account

యూఏఈలో ఉంటున్న ఓ భారతీయుడి బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.కోటికి పైగా జమయ్యాయి. తిరిగి ఇవ్వాలని సదరు సంస్థ నుంచి విజ్ఞప్తి వచ్చినప్పటికీ వాటిని అతడు చెల్లించలేదు. దీంతో అతడిపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో జరిమానాతో శిక్ష విధిస్తున్నట్లు దుబాయ్‌ క్రిమినల్‌ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

Etv rs-1-dot-28-crores-by-mistakenly-deposited-in-indian-account-dot-jail-sentence-for-him-due-to-did-not-return
పొరపాటుగా.. అకౌంట్లో రూ.1.28కోట్లు జమ.. తిరిగివ్వని భారతీయుడికి జైలు శిక్ష

By

Published : Dec 29, 2022, 11:02 PM IST

యూఏఈకి చెందిన ఓ సంస్థలో చోటుచేసుకున్న పొరపాటుతో ఓ భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.కోటికిపైగా నగదు జమ అయ్యింది. ఇదే అదనుగా భావించిన ఆ వ్యక్తి.. ఆ డబ్బును ఖర్చుచేయడం మొదలు పెట్టాడు. తప్పును గుర్తించిన ఆ సంస్థ.. బ్యాంకు సహకారంతో ఆ నగదు తిరిగివ్వాలని భారతీయుడిని కోరింది. కానీ, అతడు మాత్రం అందుకు ససేమిరా అన్నాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. అతడికి జరిమానాతోపాటు నెల రోజుల శిక్ష విధించింది.

యూఏఈకి చెందిన ఓ మెడికల్‌ కంపెనీ తన వ్యాపార భాగస్వామికి 5,70,000 యూఏఈ దిరమ్‌ (సుమారు రూ.1.28కోట్లు)లు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. కానీ, పొరపాటు వల్ల అది అక్కడే ఉంటున్న ఓ భారతీయుడి బ్యాంకు ఖాతాలో జమయ్యింది. దీన్ని గుర్తించిన ఆ వ్యక్తి.. అవి ఎక్కడ నుంచి వచ్చాయని మాత్రం తెలుసుకోలేదు. ఈ క్రమంలోనే వాటిని తిరిగి ఇవ్వాలంటూ ఆ సంస్థ నుంచి విజ్ఞప్తి వచ్చింది. అందుకు ఆ భారతీయుడు నిరాకరించాడు.

దీంతో దుబాయ్‌లోని ఏఐ రఫా పోలీసులకు సదరు సంస్థ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి బ్యాంకు ఖాతాను నిలిపివేశారు. ఈ ఘటన అక్టోబర్‌ 2021లో చోటుచేసుకోగా.. దుబాయ్‌ క్రిమినల్‌ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. జరిమానా రూపంలో ఆ నగదును తిరిగి సంస్థకు చెల్లించడంతోపాటు నెల రోజుల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా శిక్ష ముగిసిన వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

విచారణలో భాగంగా.. ఆ నగదు తన ఖాతాలో జమ అయిన మాట నిజమేనని భారతీయుడు అంగీకరించాడు. "ఆ డబ్బును ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు వాడుకున్నా. వాటిని తిరిగి ఇవ్వాలని కంపెనీ అడిగిన మాట వాస్తవమే. అందుకు నేను నిరాకరించా. ఎందుకంటే, ఆ డబ్బు వారిదేనని నాకు నమ్మకం కలగలేదు. నన్ను చాలాసార్లు తిరిగి ఇవ్వమని కోరారు. కానీ, నేను మాత్రం ఇవ్వలేదు" అని భారతీయుడు కోర్టు విచారణలో చెప్పినట్లు సమాచారం. మిగతా డబ్బు అతడి ఖాతాలోనే ఉందా..? లేక ఇతర అకౌంట్లకు బదిలీ చేశాడా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే, కోర్టు తీర్పుపై భారతీయుడు అప్పీలు చేసుకోగా.. వచ్చే వారం విచారణకు రానున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details