YCP Leaders Fighting: చెప్పులు తెగి.. చెంపలు పగిలి.. ఎంపీడీఓ ఆఫీస్లో వైసీపీ వర్గాల ఘర్షణ - శ్రీ సత్యసాయి జిల్లా కోనాపురం
YCP Leaders Fighting : పాత కక్షలు భగ్గుమన్నాయి. ఎప్పటి నుంచో రగులుతున్న వివాదం ఎట్టకేలకు బహిర్గతమైంది. ఒకరిపై మరొకరు దూసుకుపోయారు. ప్రభుత్వ కార్యాలయం వేదికగా చెప్పులతో కొట్టుకుంటూ ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో రెచ్చిపోయారు. వారంతా ఒకే పార్టీ నాయకులు కావడం గమనార్హం. శ్రీ సత్యసాయి జిల్లా కోనాపురంలో వైఎస్సార్సీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. కనగానిపల్లె ఎంపీడీవో కార్యాలయం ఎదుట చెప్పులతో ఇరువర్గాలు దాడికి దిగాయి. కోనాపురం వైఎస్సార్సీపీలో ఇరువర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం వివిధ పనుల నిమిత్తం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎదురుపడిన ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఒకరినొకరు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొనగా.. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో వివాదం సద్దుమణిగింది.