చెరువుకు గండికొట్టి పోలాల్లోకి నీటిని మళ్లించిన వైసీపీ సర్పంచ్ - అడ్డుకున్న రైతులపై దౌర్జన్యం - చెరువుకు గండి కొట్టిన వైసీపీ సర్పంచ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 10:54 AM IST
YCP Sarpanch Attacks on Farmers : చెరువుకు గండి కొట్టి నీటిని పంట పొలాల్లోకి వదిలన వైసీపీ సర్పంచి. అదేమిటని ప్రశ్నించిన రైతులపైనే తిరిగి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని చెరువు పొంగి నీళ్లు రోడ్డు పైకి చేరుతుంది. దీంతో సర్పంచి పొలాల్లోకి నీళ్లు వెళ్లేలా చెరువుకు గండికొట్టడంతో రైతులు అడ్డుకున్నారు. నీరు వెళ్లడానికి ఉన్న మార్గాన్ని వైసీపీ నేత లేఅవుట్ వేసి పూడ్చినట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంట పొలాలు దెబ్బతింటాయని చెప్పిన వినకపోగా రైతులను దుర్భాషలాడుతూ సర్పంచి వాగ్వదానికి దిగాడు. రైతులను పక్కకు నెట్టేసి జేసీబీతో గండి కొట్టించి నీరు మళ్లించారు. మీరు దిక్కున్నచోట చెప్పుకోండంటూ బెదిరించారు. సమాచారం తెలుసుకుని తహసీల్దార్, ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని నీళ్లు పొలాల్లోకి వెళ్లకుండా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి మళ్లించారు. ఆ స్థలంలో సైతం నీరు నిండి తిరిగి పొలాల్లోకి చేరడంతో రైతులు ఏమీ చేయలేక లబోదిబో అంటున్నారు.