Woman Stuck: కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన మహిళ.. వీడియో వైరల్ - కదులుతున్న రైలు ఎక్కుతూ జారి పడిన మహిళ
Woman Stuck Between Train and Platform: కదులుతున్న రైలును ఎక్కేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. అయితే రైలు ఎక్కే చివరి క్షణంలో ఆమె జారి.. ప్లాట్‌ఫామ్, రైలు బోగిల మధ్యలో చిక్కుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతూ జారి పడిన మహిళను.. రైల్వే పోలీసులు కాపాడారు. చీరాల రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ నెంబర్ రెండులో కదులుతున్న విజయవాడ-గూడూరు మెమో ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కబోయే క్రమంలో ఓ మహిళ జారి పడ్డారు. రైలు బోగి, ప్లాట్‌ఫామ్ మధ్యన స్థలంలో ఆమె ఇరుక్కుపోయారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు(GRP), రైల్వే రక్షణ దళం( RPF) అధికారులు కోటేశ్వరరావు, నాగార్జున, ఇతర ప్రయాణికుల సాయంతో మహిళను క్షేమంగా కాపాడారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళను 108లో చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.