Woman Protest: తహసీల్దార్ కార్యాలయం ఎదుట వివాహిత నిరసన.. ఎందుకంటే..! - married woman protested in Tehsildar office
Woman protest at Kalyanadurgam MRO office:ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి మండుటెండలో కూర్చోని.. తనకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట.. నేలపై చాప వేసుకుని, పొయ్యి ఏర్పాటు చేసుకుని.. తన భర్తకు సంబంధించిన ఆస్తిని బంధువులు, మేనమామ కాజేశారని.. ఈ విషయాన్ని ఆధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తన భర్తకు చెందిన ఆస్తి తమకు దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంది.
ఆస్తిని కాజేశారు-న్యాయం చేయండి.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట భూలక్ష్మి అనే వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈరోజు ఆందోళనకు దిగింది. నేలపై చాప వేసుకుని, పొయ్యి ఏర్పాటు చేసుకుని ఎండలో బైఠాయించింది. తమ భర్తకు సంబంధించిన ఆస్తిని బంధువులు, మేనమామ కాజేశారని భూలక్ష్మి ఆరోపించింది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ఆధికారుల దృష్టికి తీసుకెళ్లానని, ఇంతవరకూ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన చెందింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి..తన భర్త ఆస్తి తమకు దక్కేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో భూలక్ష్మికి పలువురు స్థానిక నేతలు అండగా నిలిచారు.
వారిపై చర్యలు తీసుకొండి-మా ఆస్తిని ఇప్పించండి.. భూలక్ష్మి అధికారులతో మాట్లాడుతూ..''పదేళ్ల క్రితం కళ్యాణదుర్గంలోని వినోద్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడూ మాకు ఇద్దరు పిల్లలు. నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో నా భర్త సమీప బంధువులు, ఆయన మేనమామ మమ్మల్ని మోసం చేసి, మా ఆస్తిని కాజేశారు. ఈ విషయంపై ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. అందుకే ఈరోజు కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. నా భర్త ఆస్తిని మాకు దక్కేటట్లు చర్యలు తీసుకోండి. మా ఆస్తిని మాకు ఇప్పించండి'' అంటూ ఆమె వేడుకుంది.