Sand Tipper Stopped: ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు.. రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆందోళన - ఏపీ తాజా వార్తలు
Villagers Protest Against Sand Tranport: వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలం పొట్టిపాడు వద్ద ఇసుక టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్న ఇసుక రీచ్ నుంచి రోజూ అధిక సంఖ్యలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నా.. అధికారులు పట్టించు కోవడంలేదని స్థానికులు ఆరోపించారు. ఈక్రమంలో పొట్టిపాడు నుంచి కొండాపురం వైపు వెళ్తున్న టిప్పర్లను గ్రామస్థులు అడ్డగించారు. స్థానికంగా ఉన్న మహిళలు వాహనానికి అడ్డంగా నిల్చుని కదలకుండా చేశారు. ఇసుక టిప్పర్లు ఈ ప్రాంతంలో తిరగకూడదు అంటూ నినాదాలు చేశారు. రోజూ టిప్పర్లు తిరగడం వల్ల రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని.. ఈ ప్రాంతంలో ఆటోలు రావడానికి కూడా ఇబ్బందిగా ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో ఇసుక మొత్తాన్ని తోడేస్తుంటే భవిష్యత్తులో తమకు తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయనీ మహిళలు ప్రశ్నించారు. మూడు రోజుల క్రితం కూడా పొట్టిపాడు గ్రామస్థులు వాహనాలను అడ్డుకొని ఆందోళన చేశారు.