Protest Against Sand Mining: అక్రమంగా ఇసుక తవ్వకాలు.. రోడ్డుపై బైఠాయించి గ్రామస్థుల నిరసన
Villagers Protest Against Illegal Sand Mining: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి సమీపంలోని స్వర్ణముఖి నది నుంచి ఇసుక అక్రమ తరలింపును రైతులు, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నదీ పరివాహక ప్రాంతాలైన నాగయ్యపరిపల్లె, కొటాల, రామిరెడ్డి పల్లి గ్రామాల రైతులు పెద్దయెత్తున రెడ్డివారిపల్లి చేరుకుని ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని ఆందోళనకు దిగారు. రైతులకు మద్దతుగా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రీచ్ గడువు ముగిసినా పోలీసుల బందోబస్తుతో ఇసుకను తరలించడంతో అంతర్యమేమిటని గ్రామస్థులు ప్రశ్నించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రెడ్డివారిపల్లె స్వర్ణముఖి నది దగ్గర ఉన్న ఇసుక రీచ్ పాయింట్‌కు గత నెలతో గడువు ముగిసింది. అయినా కూడా ఇసుకను పోలీసులు దగ్గరుండి అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై గ్రామస్థులు స్థానిక ఎమ్మార్వో శిరీషను వివరణ అడుగగా.. తాము ఎవ్వరికీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చిచెప్పిందని గ్రామస్థులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు.. తమ ఇంటి నిర్మాణాల కోసం తట్టెడు ఇసుక తీసుకెళ్లడానికి కూడా అనుమతించని అధికారులు.. ఎక్కడి నుంచో వచ్చి పోలీసుల పహారాతో టిప్పర్లకు టిప్పర్లు ఇసుక తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. నెల రోజులుగా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఇసుక తరలిస్తున్న టిప్పర్లును తామే అడ్డుకున్నామని తెలిపారు.