Vijay Kumar On State Finance: 'ఒక్కరోజు ప్రభుత్వ ఆదాయం రూ.322 కోట్లు.. అప్పు రూ.439 కోట్లు' - ycp news
TDP leader Vijay Kumar comments on AP debts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోట్లాను కోట్ల అప్పులు చేస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్అప్పుల జాతరకు అంతేలేదా..? అంటూ నిలదీశారు. ప్రభుత్వానికీ.. రోజువారీ ఆదాయం రూ.322 కోట్లైతే.. రూ.439 కోట్లు అప్పు చేస్తున్నారని ఆరోపించారు. ఆ లెక్క ప్రకారం.. రోజుకు 70 కోట్ల రూపాయల వడ్డీలు కట్టాల్సి ఉందని గుర్తు చేశారు. నెలసరి ఆదాయానికి.. 20 శాతం మించి అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ సర్కార్ ఇన్ని కోట్లు అప్పులు చేస్తున్నా, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని విజయ్ కుమార్ ప్రశ్నించారు.
జగన్ చేసిన అప్పులను తీర్చాల్సింది రాష్ట్ర ప్రజలే.. ''రాష్ట్ర త్రైమాసిక ఆదాయం రూ.29,032 కోట్లు. త్రైమాసిక అప్పులు మాత్రం రూ.39,498 కోట్లు. ఇప్పుడు మద్యం మీద రూ.15,000 కోట్ల బాండ్లు అంట! ఆదాయం కంటే రూ.10 వేల కోట్ల పైచిలుకు అప్పు చేశారు. మద్యం.. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఆదాయం కంటే అప్పులు బాగా పెరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం సొంతంగా సంపాదించిన ఆదాయం రోజుకు రూ.322 కోట్లైతే.. చేసే అప్పులు రోజుకు రూ.439 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం కట్టే వడ్డీ రోజుకు రూ.70 కోట్ల 68 లక్షలు. అప్పులు చేయడంలో రాష్ట్రం నిజంగా నెంబర్‌వన్‌గా నిలిచింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పు చేస్తున్నా కేంద్రం పట్టించుకోదా..? మద్యం ద్వారా రూ.25,000 కోట్లు వస్తాయని బడ్జెట్‌లోనే చెప్పారు. ఏపీ రుణాలపై ఆర్‌బీఐ కూడా నిబంధనలు పాటించదా..? కేంద్ర ఆర్థికశాఖ అనుమతి లేనిదే ఆర్‌బీఐ ఇవ్వలేదు కదా..? జగన్ అప్పులు చేస్తూనే ఉంటారు.. కేంద్రం చూస్తూనే ఉంటుంది. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి ఇప్పటికే 11.30లక్షల కోట్లు అప్పులు చేశారు. విచ్చలవిడిగా చేసే అప్పులను తీర్చాల్సింది రాష్ట్ర ప్రజలే'' అని విజయ్ కుమార్ రాష్ట్ర అప్పుల వివరాలను వెల్లడించారు.