Retirement Age Increase Notices: వర్సిటీల అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు పెంపు.. - ఏపీ లేటెస్ట్ న్యూస్
University Faculty Retirement Age Increase Notices: ఏపీలోని యూనివర్సిటీల అధ్యాపకులకు సర్కారు తియ్యటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని వర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు విడుదల చేశారు. ఏపీ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర యూనివర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్ పొందుతున్న అధ్యాపకులకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు వర్సిటీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు మాత్రమే ఉండగా.. దాన్ని 62కు పెంచారు. కాగా ప్రస్తుతం అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసును సీఎం జగన్మోహన్ రెడ్డి మరో మూడేళ్లుకు పొడిగించారు. దీనిపై వర్సిటీ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. నిరుద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.