Mobile Containers in Tirumala: భక్తుల వసతి సౌకర్యార్థం.. టీటీడీ వినూత్న నిర్ణయం - YV Subba reddy launched mobile containers
Mobile Containers in Tirumala: తిరుమలకు వచ్చే భక్తులకు వసతి సమస్యను పరిష్కరించేందుకు తితిదే వినూత్న నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యం పెంపొందించేందుకు తితిదే వినూత్న రీతిలో మొబైల్ కంటైనర్ వసతి సదుపాయాన్ని తీసుకురాబోతుంది. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా తిరుమల వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రయోగాత్మకంగా 2 నూతన మొబైల్ కంటైనర్లను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ప్రారంభించిన ఈ కంటైనర్లను.. తిరుమలకు భక్తులను తీసుకువచ్చే డ్రైవర్ల సౌకర్యం కోసం ఉపయోగిస్తామని తెలిపారు. 9 లక్షల రూపాయలు విలువ చేసే 2 మొబైల్ కంటైనర్లను విశాఖపట్నంకు చెందిన విశాఖ ట్రేడ్స్ పరిశ్రమ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త మూర్తి తితిదేకు విరాళమిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల కొండపై కొత్త నిర్మాణాలకు అనుమతులు లేనందున.. క్రమక్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీతో ఏర్పడుతున్న వసతి సమస్య తీర్చేందుకు అన్ని సదుపాయాలు గల ఈ మొబైల్ కంటైనర్లు చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఒక కంటైనర్లో 12 మంది నిద్రపోవడానికి బెడ్లు, టాయిలెట్ సదుపాయాలు, ఏసీ ఉన్నాయని.. భవిష్యత్లో భక్తుల సౌకర్యార్థం ఇలాంటి కంటైనర్లను తిరుమల అంతటా ఏర్పాటు చేస్తామని ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.