TTD Chairman Bhumana Karunakar Reddy Oath: ధనవంతులకు ఊడిగం చేయడానికి ఛైర్మన్ పదవి చేపట్టలేదు : భూమన - తిరుపతి
TTD Chairman Bhumana Karunakar Reddy Oath : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా సంప్రదాయ బద్దంగా భూవరాహ స్వామివారిని కుటుంబ సభ్యులతో భూమన కరుణాకర్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ చేరుకున్న భూమన దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో గరుడాళ్వర్ సన్నిధి వద్ద తితిదే ఈవో ధర్మారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వద్ద ప్రమాణం చేయించారు. తితిదే ఛైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. భూమన దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఈవో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్ర పటాన్ని వారికి అందజేశారు. దర్శనం అనంతరం స్థానిక అన్నమయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించిన నూతన తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. భక్తులకు ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారి ఆశీస్సులతో ఛైర్మన్ గా రెండోసారి అవకాశం వచ్చిందన్నారు. కష్టజీవులైన సామన్య భక్తులే నా తాత్వికత, ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ధనవంతులకు ఊడిగం చేయడానికి తాను చైర్మన్ పదవి చేపట్టలేదని, భగవంతుడి వద్ద అధిక సమయం గడిపినంత మాత్రాన అనుగ్రహం దక్కదని, వ్యయప్రయాసాలకు ఓర్చి గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండి దర్శించుకునే సామాన్య భక్తుడికే దైవానుగ్రహం లభిస్తుందన్నారు. భక్తుల వద్దకే స్వామివారి ఆధ్యాత్మిక పరిమళవాచికను తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తామన్నారు. సామాన్య భక్తులకు మెరుగైన, సౌకర్యవంతమైన ఏర్పాట్లు కల్పించే నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో తాను తితిదే ఛైర్మన్గా దళిత గోవిందం, ఎస్వీబీసీ, ప్రతి పౌర్ణమికి గరుడసేవ, కళ్యాణోత్సవాలు, కళ్యాణమస్తు లాంటి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలో టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని భూమన వెల్లడించారు.