Tribal struggle for water: తాగునీటి కోసం 'గిరి జనానికి' దినదిన గండం... గొంతు తడపాలంటే కొండ దిగాల్సిందే.. - Women Struggle for Water In Alluri in ap
Tribal struggle for water: అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మాలపేట పంచాయతీ శివారు జాజుల బంద గ్రామంలో 27 కుటుంబాల్లో 160 మంది జనాభా కొండపై జీవనం సాగిస్తున్నాయి. తమ గ్రామం నుంచి కిలోమీటర్ల దూరంలో ఉన్నచెలిమెల్లో ప్రవహిస్తున్న నీరును, తీసుకొని ఎత్తైన కొండ దాటుకుంటూ... ఆ నీరు నెత్తి మీద మోసుకొస్తున్నారు. ఈ కలుషిత నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్లు అడవి బిడ్డలు వెల్లడించారు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆస్పత్రికి వెళ్లాలంటే కనీసం 30 కిలోమీటర్లు మేరకు డోలీ కట్టుకొని మోసుకుని వెళ్లే పరిస్థితి నెలకొంది.
గ్రామంలో మంచినీరు సరఫరా కోసం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ గిరిజనులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ... చేతులు జోడించి వేడుకుంటున్నారు. పాలకుల్లారా కనికరించండి అని ప్రాథేయ పడుతున్నారు. పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే రోలుగుంట మండలం గొలుగొండ మండలం దాటుకుంటూ వెళ్లే పరిస్థితి నెలకొందని వెల్లడించారు. ఇప్పటికైనా మంచినీటి సమస్య పరిష్కరించకపోతే ఐటీడీఏ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహిస్తామని ఆదివాసి గిరిజనులు, మహిళలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రేషన్ కార్డులపై ఇస్తున్న బియ్యం కనీసం 15 కిలోమీటర్లు భుజాన్ని మీద వేసుకొని తెచ్చే పరిస్థితి నేటికీ ఇక్కడ కొనసాగుతోంది.