Tomato record Price : మదనపల్లె మార్కెట్‌లో చరిత్ర లిఖించిన టమాటా ధర.. రికార్డు స్థాయిలో కిలో రూ.168.. - మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు
Tomato Prices in Madanapalle Market: టమాటా ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయి ధరలను నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమాటా దిగుబడి తగ్గింది. దీంతో మదనపల్లె మార్కెట్‌లో రికార్డు స్థాయిలో నాణ్యమైన టమాటా కిలో 168 రూపాయలు పలికింది. దీంతో 30 కిలోల టమాటా బాక్సు విక్రయిస్తే ఒక గ్రాము బంగారు కొనుగోలు చేయవచ్చని రైతులు పేర్కొంటున్నారు. అదే విధంగా రెండో రకం కిలో టమాటా ధర.. కిలో ఆపిల్ ధరకు సమానమైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డ్‌లో బుధవారం టమాటా ధరలు పతాక స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు.. పంటకు వైరస్ సోకి దిగుబడి తగ్గిపోవడం ధరలు పెరుగుదలకు కారణమని మార్కెట్ యార్డ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం మదనపల్లె మార్కెట్ యార్డ్‌కు 361 టన్నులు మాత్రమే టమాటా దిగుబడులు వచ్చాయి. గత వారం రోజులుగా దిగుబడిని పరిశీలిస్తే అనూహ్యంగా తగ్గుతూ వచ్చాయి.