Lokesh padayatra: నేడు నెల్లూరులోకి లోకేశ్ యువగళం పాదయాత్ర.. ఏర్పాట్లు పూర్తి - enkatagiri MLA Anam Narayana Reddy Comments
Venkatagiri MLA Anam Narayana Reddy Comments on Yuvagalam: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27వ తేదీన 'యువగళం' పేరుతో చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్ర ప్రారంభమైన రోజు నుంచి నేటిదాకా అధికార పార్టీ నాయకుల నుంచి అనేక సవాళ్లు, పోలీసుల ఆంక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా కూడా వాటన్నింటినీ అధిగమించి యువగళం పాదయాత్ర ముందుకు సాగుతూనే ఉంది.
ఈ క్రమంలో నిన్నటి (సోమవారం) పాదయాత్రతో 124 రోజులు పూర్తి చేసుకున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. నేడు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా పాదయాత్ర ఏర్పాట్లను మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం నేటి పాదయాత్రలో జిల్లాలోని పలు సమస్యలను యువనేత లోకేశ్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన ఈటీవీ భారత్‌కు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం నారాయణ రెడ్డి మాట్లాడుతూ..''రాయలసీమలోని నాలుగు జిల్లాలను పూర్తి చేసుకుని ఈరోజు నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టబోతున్న యువనేత నారా లోకేశ్‌కి.. వందలాది కార్యకర్తలతో ఘన స్వాగతం పలకబోతున్నాం. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశాం. మూడు రోజులపాటు ఆత్మకూరులో నిర్వహించబోయే ఈ పాదయాత్రను పార్టీ కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ పాదయాత్రలో మర్రిపాడు ప్రజల సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకొస్తాం.. అందులో ప్రధానంగా టీడీపీ హయంలో మొదలుపెట్టిన ఆనం సంజీవ రెడ్డి హైలెవల్ కెనాల్ సమస్యను, అన్నమయ్య, సోమశీల ప్రాజెక్ట్ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి.. అధికారంలోకి వచ్చాక.. వెంటనే పూర్తి చేయాలనే అంశాన్ని ఆయనకు తెలియజేస్తాం'' అని ఆయన అన్నారు.