TDP Political Action Committee Formed: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు.. త్వరలో పొత్తులపై చర్చకు మరో కమిటీ.. - నందమూరి బాలకృష్ణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2023, 9:59 AM IST
TDP Political Action Committee Formed: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీ వ్యవహారాల నిర్వహణ, పర్యవేక్షణకు ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఆదివారం ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఆదేశాలతో 14 మంది సభ్యుల్ని కమిటీలోకి తీసుకున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాల్ని, నేతల్ని సమన్వయం చేసుకోవడంతో పాటు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. పార్టీకి మద్దతుగా వచ్చే రాజకీయ, ప్రజాపక్షాలతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరపనుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శ్రేణులకు దిశానిర్దేశం చేయనుంది. ఎలాంటి ఆధారాలు లేని కేసులో రాజకీయకక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును ఇరికించారని.. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో జరిగిన వాస్తవాల్ని క్షేత్రస్థాయిలో విస్త్రతంగా ప్రచారం చేసేలా కార్యచరణ ప్రణాళికను రూపొందించనుంది. ఈ కమిటీలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీష్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్‌బాబు, కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్థనరెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్రయాదవ్, నారా లోకేశ్‌లు సభ్యులుగా ఉన్నారు. పొత్తులపై చర్చలకు మరో కమిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.