మైనారిటీల నిధులను ప్రభుత్వం నవరత్నాలకు తరలిస్తోంది: ఎంఏ షరీఫ్ - Muslims welfare
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 10:56 PM IST
TDP Leaders Fire on CM Jagan :వైఎస్సార్సీపీ ప్రభుత్వం మైనార్టీలను మోసగిస్తోందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు. మైనారిటీలకు బడ్జెట్లో ఉన్న అరకొర నిధులు కేటాయిస్తూ వాటిని కూడా నవరత్నాలకు బదలాయిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నెల్లూరులో నగర, రూరల్ నియోజకవర్గాల ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి షరీఫ్ తోపాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్, పలువురు నాయకులు హాజరయ్యారు.
Muslim Minorities Spiritual Meeting at Nellore :ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టాక రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై దౌర్జన్యాలు, దాడులు అధికమయ్యాయని షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీల కోసం ఒక్క పథకాన్ని అమలు చేయకపోగా, గత ప్రభుత్వం ఇస్తున్న పథకాలను సైతం తొలగించారని తెలిపారు. సీబీఐ కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్, భీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని ముస్లింల వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇస్తూ ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల సంక్షేమానికి పాటుపడే తెలుగుదేశం పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక సామాన్యుల పరిస్థితి దారుణంగా తయారైందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఓ చేత్తో పది రూపాయలు ఇస్తూ మరో చేత్తో వంద రూపాయలు లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైఎస్సార్సీపీకి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని కోరారు.