Payyavula Keshav Comments: లేపాక్షి భూముల్ని కాజేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది: పయ్యావుల
Payyavula Keshav on Lepakshi Knowledge Hub Lands: లేపాక్షి హబ్ పేరుతో రైతుల నుంచి సేకరించిన భూములను జగన్ మోహన్ రెడ్డి కాజేయాలని చూస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన పయ్యావుల కేశవ్.. ఏడు వేల కోట్ల రూపాయల విలువైన లేపాక్షి హబ్ భూములను కేవలం రూ. 500 కోట్లకు కొట్టేయాలని జగన్ మోహన్ రెడ్డి యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఈ ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని, ఎంతో విలువ కలిగిన లేపాక్షి భూములను మరోసారి కొట్టేయాలని కోర్టుకు వెళ్లారని ఆయన అన్నారు. కోర్టుకు ఎందుకు వచ్చారో మీకే స్పష్టత లేదని కోర్టు నిలదీసిందని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని భూములను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొంత మంది వ్యక్తులతో కుమ్మక్కై.. లేపాక్షి భూములను కొట్టేసేందుకు వైసీపీ ప్రభుత్యం ప్రయత్నిస్తోందని పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లేపాక్షి హబ్ భూములను కాపాడుతామని పయ్యావుల కేశవ్ చెప్పారు.