కిడ్నీ వ్యాధిగ్రస్తుల పేరు చెప్పి జగన్ మోసం చేస్తున్నారు: టీడీపీ నేత కూన రవికుమార్ - Srikakulam District News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 10:26 PM IST
TDP Leader Kuna Ravikumar Criticized CM Jagan :కిడ్నీ వ్యాధిగ్రస్తుల పేరు చెప్పి జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపించారు. శ్రీకాకుళంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనపై ఆయన మాట్లాడారు. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ బాధితులకు పరిష్కారం చూపడానికి ఎన్టీఆర్ సుజలధార కార్యక్రమాన్ని టీడీపీ హయాంలోనే ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమాన్ని రూపొందించి 20 లీటర్ల మంచి నీటిని కేవలం రెండు రూపాయలకే ఇచ్చామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఏడు రూపాయలకు పెంచారని విమర్శించారు.
కిడ్నీ సమస్యలకు పరిష్కారం దొరికిందని మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనవరి ఒకటో తేదీ తర్వాత వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పైకి వెళుతుందని విమర్శించారు. సీఎం పర్యటనలో ఏవైనా కొత్త ప్రాజెక్టు జిల్లాకు ఇస్తారని ఆశ పడితే ఎప్పటిలాగే మెుండి చేయి చూపారని తెలిపారు. భారతదేశంలో మెుట్టమెుదటి సారిగా కిడ్నీ రోగులకు పింఛను ఇచ్చి వారిని ఆదుకుంది తెలుగు దేశం పార్టీనేనని వివరించారు. అలాగే జిల్లాలో 45 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు.