Dhulipalla Narendra: ఏ కేసుల మాఫీ కోసం జగన్ ఏపీకి అమూల్‌ను తీసుకువచ్చారు: ధూళిపాళ్ల - Amul Dairy in district
TDP leader Dhulipalla Narendra: సీఎం వైఎస్ జగన్ చిత్తూరు డెయిరీకి శంకుస్థాపన చేసినంత బిల్డప్ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా అమూల్ కి చోటు లేదన్న ఆయన.. ఉత్తరాది రాష్ట్ర డెయిరీ అయిన అమూల్‌ని సీఎం జగన్ ఏపీలో ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని నిలదీశారు. ఏ కేసుల మాఫీ కోసం జగన్ ఏపీకి అమూల్ ని తీసుకువచ్చారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీజ డెయిరీ సీఎం జగన్‌కు కనపడలేదా అని ప్రశ్నించారు. అమూల్ డెయిరీపై పెట్టే శ్రద్ధ సీఎం జగన్ మహిళా శక్తితో నడుస్తున్న శ్రీజ డెయిరీపై పెడితే బాగుండేదని హితవు పలికారు. పెద్దిరెడ్డి ఇలాఖాలో అముల్ డెయిరీ ఎందుకు పాల సేకరణ జరపడం లేదని ధూళిపాళ్ల నిలదీశారు. హెరిటేజ్ వల్ల సహకార డెయిరీలు మూతపడ్డాయని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. గతంలో హెరిటేజ్ పై హౌస్ కమిటీ వేసి ఏ తప్పూ తేల్చలేదని గుర్తుచేశారు. ఎన్ని రోజులు చంద్రబాబు, హెరిటేజ్ పై సీఎం జగన్ పడి ఏడుస్తాడని ధూళిపాళ్ల దుయ్యబట్టారు. కళ్ళు ముసుకున్నా, తెరిచినా సీఎం జగన్ కు చంద్రబాబు మాత్రమే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.