TDP Leader Chandrababu Criticized CM Jagan: సైకో పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం.. దసరాలోగా నూతన పాలసీ: చంద్రబాబు - ఏపీ ముఖ్యవార్తలు
TDP Leader Chandrababu Criticized CM Jagan: సైకో సీఎం జగన్ పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సర్పంచులకు అధికారాలు లేకుండా చేసిన ప్రభుత్వమిది అని ఆయన మండిపడ్డారు. పంచాయతీరాజ్ వ్యవస్థపై మండపేటలో సర్పంచులతో మాట్లాడిన చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి రాగానే వ్యవస్థకు పూర్వ వైభవం తెస్తామని అన్నారు. సర్పంచులకు గౌరవ వేతనం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దసరాలోగా నూతన పాలసీ తీసుకొస్తామని చెప్పారు. టీడీపీ(TDP) హయాంలో పంచాయతీలకి వందల సంఖ్యలో పురస్కారాలు వచ్చాయని గుర్తు చేసిన చంద్రబాబు.. ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో నరేగా పనుల ఎంపికలో సర్పంచులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని సర్పంచుల అధికారాలు తొలగిస్తే ఎలా అని ప్రశ్నించిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారాలను తొలగిస్తే జగన్ ఊరుకుంటాడా అని అన్నారు. సర్పంచుల అధికారాల తొలగింపు సరికాదని స్పష్టం చేశారు. సచివాలయం అనేది అధికార కేంద్రానికి కేంద్ర బిందువు.. ఆ అధికారమే లేకుంటే ఎలా అని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయం ప్రతిపత్తి(Autonomy) ఇవ్వడానికి ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.