TDP Leader Ayyanna Patrudu : "తుర్లవాడ కొండను కాజేసేందుకు విజయసాయిరెడ్డి కుట్ర.. ప్రజల ఆస్తులు దానం చేస్తున్న సీఎం జగన్' - జగన్ రెడ్డి అండ్ కో
TDP Leader Ayyanna Patrudu Fire on YSRCP Leader Vijayasaireddy : విశాఖ భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు ఏ-2 విజయసాయిరెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తుర్లవాడ ఆధ్యాత్మిక క్షేత్రం.. దాని జోలికి రావొద్దని ఆయన హెచ్చరించారు. విజయసాయిరెడ్డి తన కూతురు విద్యాసంస్థల నిర్మాణం కోసం 120 ఎకరాలు కేటాయించాలని జగన్ రెడ్డిని కోరారన్న ఆయన... రూ.300 కోట్ల విలువైన భూమిని విజయసాయిరెడ్డికి బహుమతిగా ఇవ్వడానికి జగన్ రెడ్డి యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆస్తిని జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు దానం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. కొండపై 120 అడుగుల నరసింహస్వామి విగ్రహం ప్రతిష్టించాలని స్థానికులు టీడీపీని కోరుతున్నారన్నారు. ఇప్పటికే టీటీడీ, సింహాచలం ఆస్తులు దోచేశారన్న అయ్యన్నపాత్రుడు.. ఆదేవుడిని టచ్ చేయవద్దని జగన్ రెడ్డిని కోరుతున్నామన్నారు. విశాఖలో జగన్ రెడ్డి అండ్ కో రూ.70 వేల కోట్ల ఆస్తులు దోచుకున్నారన్నారు... రుషికొండపై మంత్రి రోజా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు అని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. విశాఖలో దోపిడీపై సీనియర్ నేతలు బొత్స, ధర్మాన ఎందుకు మాట్లాడటం లేదని అయ్యన్నపాత్రుడు నిలదీశారు.