TDP Councillors Protest in Hindupuram Municipal Council రసాభాసగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.. టీడీపీ ప్లకార్డులు లాక్కున్న వైసీపీ కౌన్సిలర్లు - ఏపీ తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2023, 5:50 PM IST
TDP Councillors Protest in Municipal Council Meeting in Hindupuram :శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం కౌన్సిలర్లు నల్ల దస్తులు ధరించి సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా "సైకో పోవాలి .. సేవ్ డెమోక్రసీ" అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఆగ్రహించిన వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను చుట్టుముట్టి మహిళా కౌన్సిలర్ల మీదకు వెళ్లి ప్లకార్డులను బలవంతంగా లాక్కొన్నారు. అంతటితో ఆగకుండా ప్లకార్డులను చించి వేసే ప్రయత్నం చేశారు.
అనంతరం కౌన్సిల్ సమావేశంకు సంబంధం లేని వైసీపీ నాయకులు సమావేశం లోపలికి వచ్చి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ కౌన్సిలర్లు "ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. అక్రమ అరెస్టులు నశించాలంటూ" మరోసారి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సహనం కోల్పోయిన వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశాన్ని రణరంగంగా మార్చారు. తమ చేతుల్లోని ప్లకార్డులు లాగేస్తున్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం సరికాదని.. ఈ విషయంపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని న్యాయబద్ధంగా పోరాడుతామని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తెలిపారు. ప్రతిఘటించిన టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశమా? లేక వైసీపీ పార్టీ కార్యాలయం అంటూ మున్సిపల్ కార్యాలయంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.