CBN Delhi Tour: నేడు దిల్లీకి చంద్రబాబు..తాజా రాజకీయాలపై కేంద్ర పెద్దలతో సమావేశం..? - దిల్లీకి చంద్రబాబు
Chandrababu Delhi Tour: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం దేశ రాజధాని దిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర పెద్దల్ని చంద్రబాబు కలిసే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు దిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయంత్రం దిల్లీ వెళ్లి, రేపు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఎయిర్పోర్టుకు చేరుకుని దిల్లీకి వెళ్తారు. అక్కడ పార్టీ పెద్దలను కలిసి రాత్రికి అక్కడే బస చేసి రేపు మధ్యాహ్ననికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటనపై రకరకాల ఊహాగానలు సాగుతున్నాయి. దిల్లీ పర్యటనతో రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్ షాను చంద్రబాబు కలిసే అవకాశం ఉందంటూ పార్టీ శ్రేణుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరి దిల్లీ వెళ్లనున్నారు. అధినేత పర్యటనపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని పార్టీ వర్గాలు తెలిపాయి.
2019 ఎన్నికల తర్వాత అజాది కా అమృత్ మహోత్సవ్ సమయంలో ఒకసారి ప్రధాని మోదీని చంద్రబాబు కలిశారు. జీ 20 సన్నాహక సదస్సుకు హాజరయ్యేందుకు దిల్లీ వెళ్లినప్పుడు ఆయనతో మరోసారి భేటీ అయ్యారు. తరచూ టచ్లో ఉండాలంటూ ఆ సందర్భంగా చంద్రబాబుకు మోదీ సూచించిన విషయం తెలిసిందే. తాజా దిల్లీ పర్యటనలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం కూడా చంద్రబాబు దిల్లీలోనే ఉండనున్నారు. రేపు ఇంకా ఎవరెవరని కలుస్తారనే దానిపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది
అంతకుముందు 2022 డిసెంబర్ 5వ తేదీన చంద్రబాబు రెండు రోజులు దిల్లీలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం జీ20 సమాఖ్యపై నిర్వహిస్తున్న అఖిలపక్ష భేటీకి ఆయన హాజరయ్యారు. అంతకుముందు.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ భేటీలో చర్చించారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రస్తుత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు, అధికారాన్ని ఉపయోగించి చేస్తున్న అరాచకాలపై పార్లమెంటు సాక్షిగా లేవనెత్తాల్సి విషయాలపై చర్చించారని సమాచారం.