Tatikona Students Protest for Road: 'రోడ్డు కావాలి అంకుల్'.. తాటికోన విద్యార్థుల నిరసన - తిరుపతి జిల్లా తాజా వార్తలు
Tatikona Students Protest Against Cm: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయితీలోని తాటికోన ఎస్టీ కాలనీలో రోడ్డు కోసం పాఠశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. మాకు రోడ్డు కావాలి అంకుల్ అంటూ విద్యార్థులు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తమ పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు రోజు నాలుగు కిల్లోమీటర్ల మేర నడవాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. తాటికోన ఎస్టీ కాలనీలో దాదాపు 105 ఇళ్లు ఉంటాయి. సుమారు 350మంది ప్రజలు అక్కడ నివసిస్తారు. ఆ ప్రాంతంలోని కనీస అవసరాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. వారి ప్రాంతంలో రోడ్లు సరిగా లేకపోవడం వల్ల సామన్య ప్రజలతో పాటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. మోకాళ్ల లోతు గుంతలు, దుమ్ము ధూళితో తమ పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. కొన్ని రోజుల క్రితం కూడా ఈ మార్గంలో ఓ ఆటో బోల్తా పడి.. అందులో ఉన్న వారికి గాయాలయ్యాయని వారు తెలియజేశారు. ఈ విషయాన్ని ఇప్పటికి పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.