Subsidised Tomato in Vijayawada రాయితీ టమాటాల కోసం తోపులాటలు, గంటల తరబడి క్యూలైన్లు.. మరో రెండు వారాలు ఇదే పరిస్థితి!
Subsidised Tomato in Vijayawada : ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న టమాటల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టమాటాల కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉంటూ అవస్థలు పడుతున్నారు. విజయవాడ రైతు బజారులో కిలో టమాటాల ధర రూ.108 పలుకుతుంది. దీంతో ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రూ.50 అందిస్తున్న టమాటాల కోసం ప్రజలు ఎగబడతున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా సుమారు 300 మీటర్ల వరకు క్యూలో వేచి ఉంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న టమాటాల కోసం వస్తే గంటల తరబడి లైన్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు వారాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని రైతు బజారు అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత క్రమంగా టమాటాల ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని రైతు బజార్లోను ఇదే పరిస్థితి నెలకొంది.. రాయితీ టమాటాల కోసం ప్రజలు బారులు తీరారు. రాయితీ అమ్మకాలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కంకిపాడులో ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే రాయితీపై టమాటా అమ్మకాలు జరిగాయన్నారు. ప్రభుత్వం తరుచూ నిర్ధారిత రోజుల్లో ఈ రాయితీ టమాటాలను విక్రయించాలని ప్రజలు కోరుతున్నారు.