ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవం.. వేణుగానాలంకారంలో దర్శనమిచ్చిన రామయ్య.. - వేణుగానాలంకారంలో రామయ్య ఊరేగింపు వేడుక
Ramachandra In Venugana Alankaram: కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. రెండో రోజు శనివారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల సమయంలో ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తజన బృందాలు.. చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా.. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, ఏఈఓ గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈవాళ ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పెరుగు, పాలు, తేనె, చందనంతో స్వామివారికి, అమ్మవారికి అభిషేకం చేయనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించనున్నారు.