SNOW FALLS: మండు వేసవిలోనూ మంచు పరదా.. ఆకట్టుకుంటున్న దృశ్యాలు
SNOW FALLS IN KONASEEMA: రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఎండలు మండిపోతుంటే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా మంచు కురుస్తోంది. జిల్లాలో మంచు కురుస్తున్న అరుదైన దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గత ఐదు రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వేకువజాము నుంచి విపరీతమైన మంచు కురుస్తోందని, అనంతరం మధ్యాహ్నం నుంచి తీవ్రమైన వేడి గాలులతో ఎండ కాస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఉదయం మంచు దుప్పటి దట్టంగా కప్పేసినా.. మధ్యాహ్నానికి వేడి గాలులతో, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. వేసవి కాలంలో జిల్లాను ఇలా మంచు దుప్పటి కమ్మేయటంతో స్థానికులు ఆశ్యర్యానికి గురవుతున్నారు. ఇలా ముక్తేశ్వరం, కోటిపల్లి, అయినవిల్లి వద్ద.. గోదావరి నదీ పాయ, పంట పొలాల్లో మంచు కురుస్తున్న దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను అలరిస్తున్నాయి. రహదారులకు ఇరు వైపులా ఉన్న కొబ్బరి చెట్లు, వాటిపై పడుతున్న మంచు.. ఈ రమ్యమైన దృశ్యాలను ఎవరు చూసినా కళ్లు తిప్పుకోలేరంటే అతిశయోక్తి కాదు. అంత అందంగా హిమం కురుస్తున్న ఈ చక్కటి దృశ్యాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.