తిరుమలలో ఎర్రచందనం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 9:42 PM IST
Red Sandalwood Trafficking in Tirupati:తిరుపతి జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా ఆగడం లేదు. అక్రమార్కులు పోలీసులు, అటవీ అధికారుల కళ్లు కప్పి ఎర్ర చందనం దుంగలను తరలిస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారిపై కఠినమైన కేసులు పెట్టినప్పటికీ... వారు మాత్రం మారడం లేదు. అరెస్ట్ చేసి జైలుకు పంపినా.. బయటకి వచ్చిన అనంతరం... పోలీస్, అటవీ అధికారులను బురిడి కొట్టించి అడ్డదారులలో మళ్లీ ఎర్రచందనం దుంగల్ని తరలిస్తున్నారు. అలా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు
తిరుమల మెుదటి కనుమ రహదారిలో ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న కారును అలిపిరి పోలీసులు పట్టుకున్నారు. తిరుమల నుంచి తిరుపతి దారిలో తరలిస్తున్న 15 ఎర్రచందనం దుంగలను అలిపిరి తనిఖీ కేంద్రం సిబ్బంది గుర్తించారు. వాహనంతో పాటు వాటిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ వాహనం తమిళనాడుకు చెందినదిగా గుర్తించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.