Rain Water in Gudiwada bus stand: చెరువులా గుడివాడ బస్టాండ్.. ప్రయాణికులకు ఇబ్బందులు
Rain Water in Gudiwada Bus Stand:కృష్ణా జిల్లా గుడివాడలో నిన్న రాత్రి కురుసిన వర్షానికి బస్టాండ్ చెరువును తలపించింది. ప్రయాణికులు బస్టాండ్‌లోనికి వెళ్లడానికి కనీస మార్గం లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నూజివీడు, ఏలూరు వెళ్లే పాసింజర్లు వేచి ఉండే ప్లాట్‌ఫామ్‌లు బస్టాండ్ గేటు పక్కనే ఉండగా.. విజయవాడ, మచిలీపట్నం, కైకలూరు వెళ్లే ప్రయాణికులు మాత్రం బస్సుల వద్దకు చేరుకోవడానికి సాహసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌లోకి వెళ్లలేక రోడ్డుపైన వేచి చూశారు.
దశాబ్ద కాలంగా బస్టాండ్ వర్షాకాలంలో నీట మునగటం సర్వసాధారణం అయిపోయింది. వర్షాలు పడిన ప్రతిసారి ఇదే సమస్య తలెత్తుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఇటీవలే బస్టాండ్ లోపల నూతన గ్యారేజ్ పనులు చేపట్టామని.. త్వరలోనే బస్టాండ్ నూతన నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా వర్షాకాలంలో ప్రయాణికులు బస్టాండ్‌లోనికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.