Police revealed Missing Case అక్రమ సంబంధం అనుమానంతో మట్టుబెట్టారు.. 10నెలల క్రితం నమోదైన కేసును ఛేదించిన పోలీసులు
Police Solved Missing Case Cleverly: తిరుపతి జిల్లా వరదయ్యపాలెంకు చెందిన విశ్రాంత విద్యుత్ శాఖ లైన్మెన్ వెంకటేశ్వర్లు మిస్సింగ్ కేసును తొట్టంబేడు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాళహస్తి డీఎస్పీ భీమారావు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వెంకటేశ్వర్లు వరదయ్యపాలెంలో లైన్మెన్గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. పది నెలల క్రితం వెంకటేశ్వర్లు కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ అనే యువకుడి తీరుపై అనుమానం రావడంతో పోలీసులు దీనిపై ఆరా తీశారు. కాగా.. పోలీసులు దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్‌కుమార్‌కు తన తల్లితో మృతుడికి వివాహేతర బంధం ఉందనే అనుమానం ఉంది. దీంతో వెంకటేశ్వర్లును చంపేందుకు పథకం పన్నాడు. అందులో భాగంగా గుప్త నిధుల తవ్వకాల కోసం అని నమ్మించి వెంకటేశ్వర్లును పదినెలల క్రితం తొట్టంబేడు మండలంలోని అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. పథకం ప్రకారం విజయ్‌కుమార్.. మరో ఐదుగురితో కలిసి వెంకటేశ్వర్లును హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. బయట వ్యక్తులకు అనుమానం రాకుండా మృతదేహాన్ని మళ్లీ మళ్లీ తవ్వి ముక్కలుగా చేసి.. చివరకు తెలుగు గంగ కాల్వలో పడేశారు. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో బయటకు రావటంతో విజయ్‌కుమార్‌తో పాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి.. వారి నుంచి ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకుని.. రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ విక్రమ్, ఎస్సై రాఘవేంద్రను ఉన్నతాధికారులు అభినందించారు.