Jeevan Murder Case: జీవన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి ఉండొచ్చు.. పోలీసుల అనుమానం - Crime news
Engineering student Jeevan Murder Case: కృష్ణా జిల్లా పెదపులిపాకలో ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు రాత్రి సమయంలో ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థి తెల్లారేసరికి శవమై కనిపించాడు. పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామానికి చెందిన పొలాల్లో.. జీవన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి మృతదేహం పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. పంటపొలాల్లో కాలిన మృతదేహం కనపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. జీవన్ ఫోన్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలను పరిశీలిస్తున్నారు. విజయవాడ నుంచి జీవన్ పెదపులిపాక ఎందుకు వెళ్లాడని ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ పోసి తగులబెట్టి ఉంటారని పోలీసుల అనుమానిస్తున్నారు.
విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన జీవన్.. పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న రాత్రి స్నేహితుడు శ్యామ్ పుట్టినరోజు వేడుకల కోసం జీవన్ ఇంటి నుంచి వెళ్లాడని తెలిసింది. జన్మదిన వేడుకల్లో ఉండగానే మధ్యలో ఫోన్ రావడంతో వెళ్లిపోయాడని స్నేహితులు తెలిపారు. పెట్రోల్ పోసి తగులబెట్టిన ఆనవాళ్లు ఉండటంతో... హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఉయ్యూరు మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
TAGGED:
నేర వార్తలు