Pawan Kalyan Fire on YSRCP in Party Meeting: వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి: పవన్ - Varahi Yatra in Vizag
Pawan Kalyan Fire on YSRCP in Party Meeting: వైసీపీ రాక్షస పాలన నుంచి ఎట్టి పరిస్థితిల్లో రాష్ట్రాన్ని విముక్తి చేయాలని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు. ఈ నెల 10న విశాఖలో ప్రారంభమయ్యే మలివిడత వారాహి యాత్రపై మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. జనసేన పార్టీకి విశాఖ చాలా కీలకమైన ప్రాంతమని పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మలివిడత యాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడమే అని.. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ప్రజలంతా ఊడిగం చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఏడాదిలో అడుగు పెడుతున్నామని.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని షణ్ముఖ వ్యూహంతో ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులను పవన్ కోరారు. భావితరం గురించి ఆలోచించే నేతలు వేరే పార్టీ నుంచి వస్తే ఆహ్వానిస్తామని అన్నారు.