Lepakshi Handicrafts: లేపాక్షి ఎంపోరియం వేదికగా ఎర్రచందనం దుంగలాట..! - హస్తకళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యూస్
Lepakshi Handicrafts: ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా అందిస్తున్న ఎర్రచందన నిల్వ కేంద్రంలోని ముడిసరకులో అవకతవకలు జరుగుతున్నాయనే ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ లేపాక్షి ఎంపోరియంలో చేపట్టిన ఈ సోదాలో ఎర్రచందనం నిల్వల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్ బడిగించల విజయలక్ష్మి తెలిపారు. లేపాక్షి ఎంపోరియం ద్వారా మార్కెటింగ్ చేసే ఎర్రచందనాన్ని అటవీ శాఖ అధికారులు పక్కదారి పట్టించారని.. ఛైర్పర్సన్ విజయలక్ష్మి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు లోతైన విచారణ నిమిత్తం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంపై లేఖ రాసినట్లు ఆమె తెలిపారు.
బొమ్మల తయారీలో హస్తకళాకారులకు ఎర్రచందనం అందించేలా చర్యలు చేపడతామని ఆమె అన్నారు. ఎర్రచందనంలో ఎంత మేర అవకతవకలు జరిగాయో పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హస్తకళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రంగబాబు మాట్లాడుతూ.. హస్తకళాకారులకు బొమ్మల తయారీ మేరకు ఇవ్వాల్సిన ముడిసరుకు ఎర్రచందనాన్ని పక్క రాష్ట్రాలకు తరలించారని ఆరోపించారు. రాష్ట్రలో ఒక్క హస్తకళాకారుడికి కూడా ఎర్రచందనం ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన అన్నారు.
హస్తకళాకారులు ఫిర్యాదు మేరకు మే నెల 26వ తేదీ స్థానిక కేంద్రాన్ని పరిశీలించినట్లు తెలిపిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏపీ హెచ్డీసీకి ఎర్ర చందనం ముడిసరకు ఇవ్వడం జరిగిందన్నారు. అందుకు సంబంధించిన దస్త్రాల వివరాలను రా మెటీరియల్ బ్యాంకు ఇంఛార్జ్ మేనేజర్ సురేష్ ఇవ్వకుండా సుమారు 3 గంటల పాటు తాత్సారం చేశారని ఆయన అన్నారు. దీనిపై సంబంధిత ఈడీని వివరణ కోరగా.. మూడు రోజుల తర్వాత రికార్డులు అందజేస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా.. ఇది జరిగి వారం రోజులు గడిచినా ఇప్పటికీ ఆ రికార్డులు అందజేయలేదని అన్నారు.