టీడీపీ హయాంలో మైనార్టీల అభివృద్ధి.. ఇఫ్తార్ దావత్లో బాలయ్య - nandamuri balakrishna pics
Balakrishna Arranged Iftar Party: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. పట్టణంలో బలిజ సంఘం వారు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అలిహిలాల స్కూల్ క్రీడా మైదానంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తానే స్వయంగా భోజనాన్ని వడ్డించి వారితో పాటే సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందని.. గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ సోదరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చామని గుర్తు చేశారు. హిందూపురం నియోజకవర్గ ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.