Peddireddy On 2024 Election Alliances: 2024 ఎన్నికల పొత్తులపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే..! - ఒంటరిగానే వైసీపీ పోటీ
Peddireddy Ramachandra Reddy on 2024 Election Alliance : 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో విడాకులు తీసుకున్న టీడీపీ ఇప్పుడు మరోసారి కలవాలని అనుకుంటోందని అనంతపురం జిల్లా ఇన్ ఛార్జ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయని, ఇప్పుడు మరోసారి అలాంటి పొత్తులతో రావాలని చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వారు ఎందుకు కలిశారో.. ఎందుకు విడిపోయారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఎన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనా, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, తమకు ప్రజా మద్దతు ఉందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు రాజకీయంగా శక్తి హీనుడయ్యాడు.. కాబట్టే అందిరి సహకారం కోసం ప్రాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌కు ప్రజల మద్దతు ఉందని... పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మరోవైపు నారా లోకేశ్ రాయలసీమ విషయంలో చేసిన కామెంట్స్ మీద మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి ఎవరు ఎంత మేలు చేసారో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు.