Nara Lokesh criticized CM Jagan: 'కియా వద్దన్నదెవరో గుర్తుందా.. సీఎం జగన్ ఊసరవెల్లిని మించిపోయాడు'
Nara Lokesh criticized CM Jagan: దిమాక్ ఉన్న సీఎం చంద్రబాబు దునియా మొత్తం చూసి దూరదృష్టితో కియా తెచ్చారని, కోడికత్తి ఆలోచనల కోడి మెదడున్న విపక్షనేత జగన్ అప్పట్లో కియాకి భూములు ఇవ్వొద్దన్నాడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేశారు. కియా ఆరంభం కాకుండా కోర్టుకెళ్తానన్నాడని, కియాను తరిమి కొడతానన్నాడని మండిపడ్డారు. కియా కార్లు అమ్ముడుపోవట్లేదని, కమీషన్ల కోసం తెస్తున్నారని ఆరోపించాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ముందుచూపుతో తెచ్చిన కియా కరవునేలలో కార్లు పండిస్తూ.. ఓ వైపు ఉద్యోగాలు, మరోవైపు రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెడుతూ అభివృద్ధికి చిహ్నమైందని నారా లోకేశ్ కొనియాడారు. సీఎంగా వచ్చిన జగన్ కియాపై మాట మార్చేశాడన్న ఆయన.. తన తండ్రి లేఖ వల్లే కియా వచ్చిందని ఫేక్ లెటర్ రిలీజ్ చేయించుకున్నాడని ఆరోపించారు. అదే కియా పది లక్షల కార్లు ఉత్పత్తి చేసి రికార్డు క్రియేట్ చేస్తే... అది తన గొప్పే అంటూ ట్వీట్లు వేస్తున్నాడని విమర్శించారు. రాజకీయాల్లో ఇలా రెండు నాలుకలు, రెండు ముఖాలు ప్రదర్శించి జగన్ ఊసరవెల్లిని మించిపోయాడన్నారు. తన జె ట్యాక్స్ కోసం లులూ, అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మాదిరిగా కియాని తరిమేయకుండా జగన్ ఉంటే అదే కియాకి ఇచ్చే అతి పెద్ద ఇన్సెంటివ్‌గా పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడి ప్రయత్నాలు, తెలుగుదేశం ప్రభుత్వం కృషితో వచ్చిన కియా 10 లక్షల కార్లు ఉత్పత్తిని అధిగమించిన సందర్భంగా సంస్థ యాజమాన్యానికి, ఉద్యోగులకి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.