Kanna In Mahanadu: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది: కన్నా లక్ష్మీనారాయణ - మహానాడులో కన్నాలక్ష్మీనారాయణ
Kanna Comments In Mahanadu : వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభిస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా చంద్రబాబు నాయకత్వంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని తెలియజేశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక చరిత్ర సృష్టించిన నాయకుడని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలాకాలం కొనసాగిన ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో చాలాకాలం కొనసాగిన ప్రతిపక్ష నేతగా రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా.. ఎవరూ చెరపలేని రికార్డు సృష్టించాడని గుర్తుచేశారు. అటువంటి రాజకీయ నాయకుడి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో గెలిచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించాలని ప్రజలను కోరారు. అలాగే రాష్ట్రం అభివృద్ధి, మన రాష్ట్ర రాజధాని దేశంలోనే ప్రధమ స్థానంలో ఉండేలా మనం కంకణం కట్టుకొని పని చేయాలని ప్రజలకు, కార్యకర్తలకు కన్నా పిలుపునిచ్చారు.