Jana Chaitanya vedika on volunteer system: 'వార్డు సచివాలయాలు రాజ్యాంగ విరుద్ధం.. వాలంటీర్ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి విఘాతం'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2023, 5:40 PM IST
Jana Chaitanya vedika on volunteer system: ప్రజాప్రతినిధులు, పౌర సమాజ భాగస్వామ్యం లేని వార్డు సచివాలయాలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి విఘాతమని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. 1993 జూన్ 1 నుంచి అమలులోకి వచ్చిన 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో వార్డు కమిటీ (Ward Committees)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. వాటికి బదులుగా ప్రజల, ప్రజాప్రతినిధుల పాత్ర లేని గ్రామ, వార్డు సచివాలయాలను రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పాటు చేశారని తెలిపారు.
కాగ్(CAG) కూడా ఈ వ్యవస్థను తప్పు పట్టిందని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. అధికార పార్టీ కార్యకర్తలను ప్రజల సొమ్ముతో వాలంటీర్లుగా నియమించి పార్టీ ప్రయోజనాలకు వాడుకోవటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లు, లక్షా 30 వేల పైగా సచివాలయ సిబ్బందిని నియమించిన ప్రభుత్వం.. వీరిందరితో పని చేయించుకునే పరిస్థితి లేదన్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులు సైతం గ్రామ పంచాయతీలకు దక్కకుండా ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, ఈ నిధులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని జనచైతన్య వేదిక తరఫున లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు.