ISRO Chairman At Chengalamma Temple: సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మను దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్.. శ్రీవారి సేవలో శాస్త్రవేత్తలు
ISRO Chairman Visited Chengalamma Temple: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ తల్లిని దర్శించుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. చంద్రునిపై దాగి ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చంద్రయాన్-3 ప్రయోగిస్తున్నామన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆశిస్తూ చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. రేపు సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి జాబిల్లిపైకి వెళ్లే చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలని నమూనా నౌకకు ఇవాళ వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి పాదాల చెంత అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న శాస్త్రవేత్తలకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా.. చంద్రయాన్-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 24 గంటలు కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం ఇదే సమయానికి రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్.వీ.ఎమ్-3P4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.