Independence Day Celebrations: పంద్రాగస్టు అంటే మాకు పండుగ.. చిన్నారుల సమైక్య సంబురాల వేదిక - independence day celebrations 2023
Independence Day Celebrations: ఆగస్టు 15.. స్వాతంత్య్ర దినోత్సవం వస్తుందంటేనే చాలు.. పాఠశాల విద్యార్థుల్లో ఆనందం అంతా ఇంతా కాదు. వారం రోజులకు ముందే సందడి మొదలవుతుంది. వేడుకల సందర్భంగా నిర్వహించే ఆటపాటల్లో.. ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతుంటారు. ఒక్కరోజు ముందుగా.. తరగతి గదులను అలంకరించుకుని సంబరపడిపోతారు.. ఇక.. జెండా వందనం రోజున మిఠాయిల పంపిణీ.. బహుమతి ప్రదానోత్సవానికి వేయికళ్లతో ఎదురుచూస్తూనే.. ఉపాధ్యాయులు, స్థానిక నేతల ప్రసంగాలు వింటుంటారు. అంతకు ముందుగా ప్రభాత భేరీ నిర్వహించి గ్రామాన్ని మేల్కొల్పడంలో ఉత్సాహంగా పాల్గొంటారు. వాడవాడనా ర్యాలీ తీసి నినాదాలు చేస్తుంటారు. ఇది ఏటా జరిగే ఉత్సవమే అయినా.. ఆ ఆనందమే వేరు. ఇదిలా ఉండగా కొన్నేళ్లుగా.. పొడవైన జాతీయ జెండా ప్రదర్శనలు చేపట్టడం చూస్తూనే ఉన్నాం. విద్యాసంస్థలైన పాఠశాలలు, కళాశాలల మధ్య ఈ స్నేహపూర్వక పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని పలు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. కందుకూరులో 100 మీటర్ల జాతీయ పతాకంతో వందలాది మంది చిన్నారులు కదం తొక్కారు.