గోదావరిలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో రైతుల ఆవేదన - east godavari latest news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 12:07 PM IST
Illegal Sand Mining In Burrilanka Godavari River: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక ఇసుక రేవులో అడ్డగోలుగా ఇసుక తవ్వకాల వల్ల లంకలో ఉన్న తమ నర్సరీలు గోదావరిలో కలిసిపోతున్నాయని ఓ దళిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి గట్టును ఆనుకొని ఉన్న ఇసుకను తవ్వటంతో లంక భూములు వరదల సమయంలో గోదావరిలో కలిసిపోతున్నాయని పేర్కొన్నారు. బుర్రిలంక ఇసుక ర్యాంపులో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని పరీశీలనకు వచ్చిన టీడీపీ స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్ద రైతు తన గోడు వెళ్ల బోసుకున్నారు.
భారీగా ఇసుక లారీలు రేవుకు రావటంతో నర్సరీల్లోని మొక్కల రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోందన్నారు. ఈ తవ్వకాల కారణంగా నర్సరీలోని మొక్కలు కొనటానికి ఎవ్వరూ రావట్లేదని, అధికారులు ఈ అక్రమాలపై పట్టించుకోవట్లేదని తెలిపారు. పోలీసులకు చెబితే వాళ్లు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని దళిత రైతు వాపోయారు. వైసీపీ ప్రభుత్వం దళితులను పట్టించుకోవట్లేదని స్థానిక రైతు ఆవేదన వ్యక్తం చేశారు.