House Locked in Palnadu: కుమారుడు మోసం చేశాడని తల్లిదండ్రులకు శిక్ష..! ఇంటికి తాళం.. - ఏపీ తాజా వార్తలు
House Locked in Gurajala: పల్నాడు జిల్లాలో ఓ అమానవీయ ఘటన వెలుగుచూసింది. గురజాల పట్టణంలోని ఓ వృద్ధ దంపతుల ఇంటికి కొందరు తాళం వేయడంతో.. వారు రోడ్డున పడ్డారు. పట్టణంలోని ఓ ఎరువుల దుకాణంలో పని చేస్తున్న శివరామకృష్ణ అనే వ్యక్తి.. సుమారు 70 లక్షల రూపాయల మేర మోసం చేశారన్న ఆరోపణలతో.. నిన్న సాయంత్రం అతడి తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటికి కొందరు వచ్చారు. ఇంట్లో ఉన్న వారిని బయటికి పంపించి.. గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో శివరామకృష్ణ తల్లిదండ్రులైన విజయలక్ష్మి, సత్యనారాయణ.. నిన్న రాత్రి నుంచీ ఇంటి బయటే కూర్చున్నారు. కుమారుడిపై ఆరోపణలు చేస్తూ... అధికార పార్టీ నాయకుల అండతో కొందరు ఈ చర్యలకు పాల్పడుతున్నారని.. వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలతో.. పోలీస్‌స్టేషన్‌లో బెదిరించి 30 లక్షల రూపాయలకు నోటు రాయించుకున్నారని వాపోయారు. డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతూ ఇంటిపై దాడి చేయడమేంటని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.