Farmers Protest: 'పంట ఎండిపోతోంది.. కాస్తా కనికరించండి సారూ' - రైతుల వార్తలు
'అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా' తయారైంది రైతుల పరిస్థితి. భూగర్భంలో నీరు ఉండటంతో వారు పంటలు వేశారు. కానీ విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసని కాలం కావడంతో పంటలు ఎండిపోతే తీవ్ర నష్టాలు చూడవలసి వస్తుందని రైతులు వారి బాధను విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నారు.
సక్రమంగా విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయంటూ విద్యుత్ సబ్ స్టేషన్ను రైతులు ముట్టడించారు. శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం హెచ్.డి. హళ్ళిలోని విద్యుత్ ఉప కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయి. పంటలకు అందించాల్సిన తొమ్మిది గంటల నాణ్యమైన కరెంటును సక్రమంగా అందించాలని రైతులు నినాదాలు చేశారు. విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
రైతులు మాట్లాడుతూ వర్షాలతో భూగర్భ జలాలు నిండి బోర్లలో నీరు అధికంగా ఉండడంతో పంటలకు అప్పులు చేసి పెట్టుబడిగా పెట్టామని, పంటలకు 9 గంటలు ఇవ్వాల్సిన నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా కేవలం అరకొరగా ఇవ్వడంతో పంటలు ఎండిపోతున్నాయని, కొన్ని నెలలుగా విద్యుత్ సమస్యతో సతమత అవుతున్నామని వారు వాపోయారు. సమస్యపై అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యుత్ ఉప కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి 9 గంటల విద్యుత్ అందించాలని రైతులు ప్రాధేయపడ్డారు.