Fake Currency Notes Seized in Srikakulam District: రూ.2 వేల నోట్లు మారుస్తామని మోసం.. రూ.55 లక్షల విలువైన దొంగనోట్లు పట్టివేత - fake currency notes exchange
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 6:05 PM IST
Fake Currency Notes Seized In Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో సుమారు రూ. 55 లక్షల విలువ చేసే 2వేల రూపాయల నకిలీ నోట్లను పోలీసులు సీజ్ చేశారని.. జె.ఆర్.పురం సీఐ ఆదాం తెలిపారు. నకిలీ నోట్లను తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసి, విచారణ జరపగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. సీఐ ఆదాం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో వీర మణికంఠ అనే వ్యక్తి రూ.37 లక్షల విలువ చేసే నకిలీ 2వేల నోట్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారన్నారు. మరో ఘటనలో పైడిభీమవరం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. విజయనగరం జిల్లాకు చెందిన విజయకుమార్, కర్ణాటకవాసి వెంకటరెడ్డిలు 17.98 లక్షల విలువైన నకిలీ 2 వేల నోట్లను తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారన్నారు. ఈ రెండు ఘటనల్లోని నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు వారిపై కేసు నమోదు చేసి..రెండు వాహనాలను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ ముఠాలు కొన్ని గ్రూపులుగా ఏర్పడి.. 2వేల నోట్లు మారుస్తామని నమ్మబలికి, అమాయక ప్రజలను మోసగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సీఐ ఆదాం ఘటన వివరాలను వెల్లడించారు.