Suicide బస్సు ఫీజు కట్టలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. శోకసంద్రంలో తల్లిదండ్రులు
Engineering Student Suicide: కృష్ణా జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. గుడివాడ శ్రీరామాపురంలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గుడివాడ వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందంటే?..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుడివాడ శ్రీరామాపురానికి చెందిన బండారి నాగేశ్వరరావు పెద్ద కుమార్తె లిఖిత నవ్య(22) విజయవాడలోని లింగయ్య ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గుడివాడ నుంచి ప్రతిరోజు కళాశాల బస్సులోనే విజయవాడ వెళ్లి వచ్చేది. అయితే బస్సు ఫీజు కట్టకపోవటంతో 4 రోజులుగా కళాశాలకు వెళ్లకుండా విద్యార్థిని ఇంటివద్దనే ఉండేది. దీంతో మనస్తాపానికి గురైన నవ్య సోమవారం ఉరిపోసుకుంది. ఇది గమనించిన విద్యార్థిని కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నవ్య చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. విద్యార్థిని తండ్రి సమీపంలోని ఓ హోటల్లో పనిచేస్తూ ఉండగా.. తల్లి, సోదరి వేర్వేరు చోట్ల పనిచేసుకుంటూ జీవనం సాగించే వారు. కుటుంబంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న నవ్యకు మంచి భవిష్యత్తు ఉందని, ఎంతో వృద్ధిలోకి వస్తుందని అనుకున్న తల్లిదండ్రులు.. కుమార్తె ఆత్మహత్య చేసుకోవటంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.