Education Minister Botsa Satyanarayana: విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో పుస్తకాలు..
Education Minister Botsa Satyanarayana : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్ధుల కోసం సుమారు 371 పుస్తకాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచే కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ శేషగిరిబాబు సమక్షంలో ఈ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారు. 42 లక్షల మంది ప్రభుత్వ, 28 లక్షల మంది ప్రైవేటు విద్యార్ధులకు సుమారు ఎనిమిది కోట్ల పుస్తకాలను ఏటా ముద్రించి అందిస్తున్నామన్నారు. వీటికి అదనంగా ఆయా పుస్తకాల సాఫ్ట్‌కాపీలను పీడీఎఫ్ ఫార్మెట్‌లో విద్యార్ధులు ఫోన్లలో చదువుకునేందుకు అనువుగా ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామన్నారు. ప్రస్తుతం 353 పుస్తకాలను ఆన్‌లైన్ ఉంచామని.. మరో 18 టైటిల్స్‌ను మరికొద్ది రోజుల్లోనే అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు.